మతాన్ని కించపరిచేలా మాట్లాడారని బాగు గోగినేనిపై కేసు నమోదు
  • 6 years ago
బిగ్ బాస్ 2 కంటెస్టెంట్, హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మతాన్ని కించపరిచేలా ఆయన యూట్యూబ్‌ వీడియోలో మాట్లాడారనే అంశంతో పాటు వారు చేపట్టే ప్రైవేటు కార్యక్రమం కోసం ఆధార్‌ నంబర్లను తీసుకోవడంపై కేవీ నారాయణ అనే వ్యక్తి ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం బిగ్ బాస్ 2 రియాల్టీ షోలో ఉన్న బాబు గోగినేని ఈ కేసు నేపథ్యంలో బయటకు వస్తారా? నెక్ట్స్ ఏం జరుగబోతోంది? అనేది హాట్ చర్చనీయాంశం అయింది.
మాదాపూర్‌ పోలీసులు బాబు గోగినేనిపై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో ఉన్న ఆయన న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది హాట్ టాపిక్ అయింది.
బిగ్ బాస్ 2 రియాల్టీ షో ప్రస్తుతం మూడో వారంలోకి ప్రవేశించింది. సోమవారం ఎలిమినేషన్ నామినేషన్లు జరిగాయి. అయితే ఈ వారం ఈ లిస్టులో బాబు గోగినేని లేక పోవడం గమనార్హం. ఒక వేళ ఆయన ఎలిమినేషన్ జాబితాలో ఉండి ఉంటే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉండేదేమో?
గత సీజన్లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ముమైత్ ఖాన్ బిగ్ బాస్ ఇంట్లో ఉండగా.... ఆమె టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. దీంతో ఆమెను ఇంటి నుండి ఎలిమినేట్ చేసి మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Recommended