BJP offered Rs. 100 Crores Says Kumaraswamy
  • 6 years ago
JD(S) state president HD Kumaraswamy on Wednesday accused the Bharatiya Janata Party (BJP) of offering Rs 100 crores and cabinet posts to some Janata Dal (Secular) MLAs.
#Yeddyurappa
#Siddaramaiah
#Azad


కన్నడనాట రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పావులు కదుపుతుంటే, ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాలూ ఎత్తులుపైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. జేడీఎస్‌ఎల్పీ నేతగా కుమారస్వామి ఎన్నికయ్యారు. జేడీఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆయన, ఫలితాలు తనకు సంతోషాన్ని ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజేపీకి 104 సీట్లు దక్కడానికి సెక్యులర్ ఓట్లు చీలిపోవడమే కారణంకానీ, మోదీ చరిష్మాకాదని ఎద్దేవా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన మొహం చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, సెక్యులర్ ఓట్లు చీలడం వల్లే బీజేపీకి 104 సీట్లలో విజయం లభించిందని విమర్శించారు. కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ వెంపర్లాడుతోందని, తమ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు మంత్రి పదవి, రూ.100 కోట్లు ఇస్తామని ఆశచూపి తనవైపు తిప్పుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లను రాష్ట్రపతి, గవర్నర్, మోదీ ప్రోత్సహిస్తారా? లేక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా? అని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై మోదీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో తాము చేతులు కలిపామని కుమారస్వామి వెల్లడించారు. జేడీఎస్ నుంచి రేవణ్ణ వర్గం చీలుతుందన్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు.
మరోవైపు జేడీఎస్ శాసనసభాపక్ష నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నామని, తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు. కుమారస్వామితో కలిసి మీడియా ముందుకొచ్చిన రేవణ్ణ... జేడీఎస్ నుంచి తాను బయటకు వస్తున్నాననే వార్తల్లో నిజం లేదని, ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు. జేడీఎస్ ఎల్పీ నేతగా ఎన్నికైన కుమారస్వామిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.