టీడీపీ, వైసీపీలు మోడీకి వత్తాసు : రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం

  • 6 years ago
Jana Sena chief Pawan Kalyan met CPI and CPM leaders( Left Parties) on Monday over ap special status.

ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, బీజేపీతో ఇన్నాళ్లు లాలూచీ పడి, ఇప్పుడు తానే ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు సోమవారం మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఏపీకి రాజధాని లేదని, విద్యాసంస్థలు లేవని, నిధులు లేవని, రైల్వే జోన్ లేదని, ప్యాకేజీ లేదని, జాతీయ విద్యా సంస్థలు ఇస్తామని చెప్పినప్పటికీ నత్తనడకన సాగుతోందని సీపీఎం మధు అన్నారు. విభజన చట్టంలో చెప్పినవి ఏవీ జరగడం లేదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని బీజేపీ, హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తేలేని టీడీపీ, దీనిపై తీవ్ర పోరాటం చేయాల్సిన వైసీపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి తీవ్ర ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు మధు తెలిపారు. విభజన హామీల విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లల్లా ఏపీ పరిస్థితి ఉందన్నారు. మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. రాయలసీమతో ప్రారంభించి ప్రకాశం, ఉత్తరాంధ్రలో ఉద్యమిస్తామన్నారు.
బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో పెద్ద డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. మోడీ, అమిత్ షాలు ఢిల్లీలో ఉండి ఏపీకి అన్యాయం చేస్తే, టీడీపీ, వైసీపీలు మోడీకి వత్తాసు పలికి, అన్ని ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచి ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోడీతో లాలూచీ పడ్డారని చంద్రబాబు, జగన్‌లపై మండిపడ్డారు.

Recommended