టీడీపీ అంటే తెలుగు 'డ్రామా' పార్టీ, అవినీతిని తవ్వడానికి బుల్డోజర్ కావాలి

  • 6 years ago
BJP leader Somu Veerraju on Saturday lashed out at Andhra Pradesh CM Chandrababu naidu and TDP.

తెలుగుదేశం ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం, ప్రతీ కార్యక్రమంలోనూ అవినీతి చోటు చేసుకుంటోందని అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఉన్న మెకానిజం ఏంటి? అని ప్రశ్నించారు. రూ.1120కోట్లతో అయ్యే పట్టిసీమకు రూ.1660కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని నిలదీశారు. శనివారం సోము వీర్రాజు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మట్టి తీయడానికే 67కోట్లు ఖర్చు అవుతుందా? అని ప్రశ్నించారు.
స్పీల్ వేలో రూ.1400 ఖర్చు ఎందుకు జరిగిందని నిలదీశారు. పంపు సెట్లకు రూ.340 కోట్ల ఖర్చు వస్తుందా?, కెనాల్ కలపడానికి గొట్టాల కోసం రూ.817కోట్లు ఎలా అయ్యిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. పట్టిసీమలో 24పంపులు వేసి, 30పంపుల డబ్బులు కాజేశారని ఆరోపించారు. మట్టి తరలించిన లారీకి రూ.4లక్షలా? అని మండిపడ్డారు.
రాష్ట్రంలో అవినీతిపై కాగ్ నివేదికే నిదర్శనమని సోము వీర్రాజు అన్నారు. తాను చెప్పేవన్నీ కాగ్ మీటింగ్ లో తేలిన విషయాలేనని అన్నారు. ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు, పారా సరిపోదని.. బుల్డోజర్ కావాలని అన్నారు.
సీఎం చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీల్లో భారీ అవినీతి చోటు చేసుకుంటోందని అన్నారు. ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు నిర్మించాలంటే రూ.20వేల లంచం అడుతున్నారని ఆరోపించారు. కొత్త పెన్షన్ కోసం మూడు నెలల డబ్బులు తీసుకుంటున్నారని అన్నారు. కట్టని బాత్రూంలకు ఒక్కో మండలానికి రూ.5కోట్లు కాజేశారని సోము వీర్రాజు ఆరోపించారు.
టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అయ్యిందని ఎద్దేవా చేశారు. దేశంలో కిందిస్థాయికి అవినీతిని తీసుకెళ్లిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని అన్నారు. చెట్టునీరుకు రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తారా? అని మండిపడ్డారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు జరగాల్సిందేనని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు సీఎం కంటే ఎక్కువైపోయారని, సీఎం వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారని అన్నారు. ఇసుక లారీకు రూ.2వేలు వసూలు చేస్తున్నారని.. ఈ సొమ్మంతా ఎక్కడ పోతోందని సోము వీర్రాజు ప్రశ్నించారు. అవినీతిని డీ సెంట్రలైజ్ చేస్తున్నారని మండిపడ్డారు.

Recommended