Vijaya Sai Reddy's Politics in Parliament

  • 6 years ago
YSR Congress Rajya Sabha MP V Vijaya Sai Reddy called on President Ram Nath Kovind in New Delhi on Thursday and complained that the TDP was acting against the spirit of the Constitution in the Upper House

ఓవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరు.. అదే సమయంలో ఇరు పార్టీల సమరం.. వెరసి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వేర్వేరుగా తమ నిరసనల్ని తెలియజేస్తూ వస్తున్న టీడీపీ, వైసీపీలు.. సంధు దొరికితే చాలు ప్రత్యర్థి పార్టీని విమర్శించేందుకో.. ఇరుకున పెట్టేందుకో ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడా ఛాన్స్ వైసీపీకి దొరికింది. టీడీపీని ఇరుకునపెట్టేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యవహారాన్ని చర్చకు పెట్టడంలో సఫలమయ్యారు. అంతేనా.. నైతికంగా ఇది వెంకయ్య, మోడీలను ఇబ్బందిపెట్టే విధంగా విజయసాయిరెడ్డి ముందుకు వెళ్తున్నారు.
కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీని, ఇటు బీజేపీని ఇరుకునపెట్టేవిగా మారాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. సలహాలివ్వడంలో తప్పేమి లేదంటూ దాటవేత ధోరణిని ప్రదర్శించినా.. నైతికంగా ఇది చెల్లుబాటు కాదని విజయసాయిరెడ్డి పరోక్షంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రపతిని కలిసి విషయం మొత్తం ఆయన ముందు పెట్టారు.
కేంద్ర కేబినెట్‌లో సభ్యుడిగా ఉన్న వ్యక్తే.. బడ్జెట్‌ను తప్పుపడుతున్నాడంటే.. దీనికి పూర్తి స్థాయి కేబినెట్ ఆమోదం లేదా?.. కేబినెట్ మంత్రులను కేవలం నామమాత్రానికే కూర్చొబెట్టి వాళ్లతో ఆమోదముద్ర వేయించుకున్నారా?.. అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. సుజనా చౌదరి బడ్జెట్‌ను తప్పు పట్టడం పరోక్షంగా మోడీ ప్రభుత్వంపై కేబినెట్ మంత్రి అవిశ్వాసమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి
సుజనాచౌదరి వ్యవహారం ఇప్పుడు టీడీపీ, బీజేపీలకు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. కేంద్ర కేబినెట్‌లో సభ్యుడే బడ్జెట్ పై విముఖత వ్యక్తం చేస్తున్నాడంటే.. ఇక ఇది అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఎలా అవుతుందనేది ప్రశ్న. కేబినెట్ సభ్యులే మెచ్చని బడ్జెట్ ద్వారా ప్రజలందరి ఆమోదం పొందుదామని ఎలా ప్రయత్నించారన్నది ప్రశ్న. ఈ ప్రశ్నలన్నింటికి ఇప్పుడు బీజేపీ వద్ద సమాధానాలు కరువైపోయాయి