పాకిస్తాన్‌లో మళ్లీ రేగిన ‘భగత్ సింగ్’ మంటలు !

  • 6 years ago
స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారిపై పోరాడిన సర్దార్‌ భగత్‌ సింగ్‌ను పాకిస్తాన్‌లోని అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అయిన 'నిషాన్‌ ఏ హైదర్‌'తో సత్కరించాలనే డిమాండ్‌ ఊపందుకుంది.
ఆయనను 86 ఏళ్ల కింద ఉరి తీసిన లాహోర్‌లోని షాదమన్‌ చౌక్‌లో భగత్‌సింగ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా భగత్‌సింగ్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ డిమాండ్‌ చేస్తోంది. ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఇంతియాజ్‌ ఖురేషీ మాట్లాడుతూ.. భగత్‌ సింగ్‌ ఒక యూత్‌ ఐకాన్‌ అని, నేటి యువతకు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అని వ్యాఖ్యానించారు.
‘సర్దార్ భగత్‌ సింగ్‌.. నిజమైన స్వతంత్ర యోధుడు. చిన్నతనంలోనే బ్రిటీష్‌ వారితో భగత్‌ చేసిన పోరాటం అసామాన్యం..' అని భగత్‌సింగ్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఇంతియాజ్‌ ఖురేషీ కొనియాడారు. భగత్ సింగ్‌ను పాకిస్తాన్‌ అత్యున్నత గ్యాలంటరీ మెడల్‌ ‘నిషాన్‌ ఏ హైదర్‌'తో సత్కరించాలని ఖురేషీ డిమాండ్ చేశారు.
దీనిపై తాజాగా మరోసారి పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నా సైతం భగత్‌ సింగ్‌ త్యాగానికి నివాళి అర్పించాలన్న వ్యాఖ్యలను తన లేఖలో పొందుపరిచారు.
పాకిస్తాన్‌ సైన్యంలో అత్యంత ధైర్యసాహసాలు, ప్రతిభ కనబర్చిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే ‘నిషాన్‌ ఏ హైదర్‌'. ఈ పదానికి ‘సింహబలుడు' అని అర్థం. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం భగత్ సింగ్‌కు ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలంటూ కొంతకాలంగా డిమాండ్ ఉంది.